3వ పాఠము: లోతుగా వెళ్ళుట
Recognizing Responsibility
చాలా సంవత్సరాల క్రితం నేను ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రదర్శన సెమినార్‌కు హాజరైన విషయం గుర్తుంది. ఒక సంస్థ తాము ఇటీవల మెరుగుపరచిన సాఫ్ట్‌వేర్ ఏమి చేయగలదో చూపిస్తోంది. చాలా ప్రదర్శనల మాదిరిగానే, వారు అద్భుతంగా వివరించారు — చివరికి ఆ ఉత్పత్తి తమను మరింత సమర్థులుగా, ఫలప్రదులుగా చేస్తుందని పాల్గొన్నవారు నమ్మేంతగా. వినియోగదారుడు తన సమస్యలు ఈ సాఫ్ట్‌వేర్‌తో పరిష్కారమవుతాయని నమ్మాడు. కానీ సమస్య ఏమిటంటే, ఆ ఉత్పత్తి అతని దగ్గర లేదు! నిజంగా మరింత ఫలప్రదుడవ్వాలంటే, అతడు ముందుగా దానిని కొనుగోలు చేయాలి.
మొదటి మరియు రెండవ పాఠాలలో మానవులు ఎందుకు చింతిస్తారో పరిశీలించాము. అయితే అది తెలుసుకోవడం మాత్రమే చింతను అధిగమించడానికి సరిపోతుందా? కాదు. మనం ఇంకా లోతుగా వెళ్లాలి. ఎలా? దేవుని సత్యం మన హృదయాలను తాకడానికి అనుమతించడం ద్వారా. మనం ఏ సాఫ్ట్‌వేర్‌నూ కొనవలసిన అవసరం లేదు — ఇది ఉచితం! కానీ ఆ సత్యం మన జీవితాలను మార్చడానికి దానికి అవకాశం ఇవ్వాలి. సత్యం మనకు సహాయం చేయాలంటే, అది ముందుగా మన మనస్సులో ప్రవేశించాలి.
చింతలను విడిచిపెట్టి దేవుని శాంతిని పొందే దిశగా ఈ పాఠం మిమ్మల్ని ఒక పెద్ద అడుగు ముందుకు నడిపిస్తుంది. దేవుని శాంతి లేకుండా, మనం నిజంగా చింతలేని జీవితం గడపలేము.
కొనసాగించడానికి ముందు ప్రార్థన చేద్దాం.
ప్రార్థన
ప్రియ తండ్రి, మేము చాలాసార్లు పైపై విషయాలతోనే సంతృప్తి పడే ప్రజలముగా ఉంటాము. లోతైన సత్యం కంటే పైపైదాన్ని, సాధారణమైనదాన్ని అంగీకరిస్తాము; శ్రేష్ఠతను, సంపూర్ణతను వెంబడించము. మమ్మల్ని విడుదల చేసే సత్యాలను తెలుసుకోవడమే కాకుండా, ఆ సత్యాలు మా జీవితాల్లో నిజంగా పనిచేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేయునట్లు సహాయపడుము. మీ వాక్యం వాగ్దానం చేసిన దానికంటే తక్కువదానితో మేము తృప్తిపడకుండునట్లు చేయుము. మా మొండితనాన్ని, మా అంధత్వాన్ని, మా చింతలనుకూడా బద్దలు చేసి, మీ గొప్ప మహిమగల శాంతిలోనికి మమ్మల్ని నడిపించుము. క్రీస్తు నామంలో, ఆమెన్.
"మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును."
— యోహాను 8:31-32సింహావలోకనం
కొంచెం పునర్విమర్శ చేసుకుందాం.
1. తలక్రిందులైన వంపు — దేవుడు మనల్ని తీసుకువెళ్లదలచిన వంతెనను లేదా ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. మనలో చాలామంది ఆ వంతెనపై ఇప్పటికే ఒకటి లేదా రెండు అడుగులు వేసి ఉండవచ్చు.
2. లోయ — చింతకు సంబంధించిన ఐదు చారిత్రక దశలను ఇది సూచిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చివరి మూడు వర్గాలలో ఒకదానికి చెందినవారమై ఉంటాం:
- స్వీయాధారితుడు (క్రైస్తవుడు కానివాడు)
- చింతించని వాడు (మనము ఉండవలసిన స్థితి — శిఖర స్థానం)
- ప్రభువుకంటే తనను తాను ఎక్కువగా నమ్ముకొనే వాడు (క్రైస్తవుడు)
3. రెండు బాణాలు — ఈ పుస్తకం యొక్క రెండు ముఖ్య లక్ష్యాలను సూచిస్తాయి.
మొదటిది — యేసుక్రీస్తు ద్వారా ప్రజలను దేవునిపై నమ్మకం ఉంచే స్థితికి తీసుకువచ్చుట. ఆయన శాంతి రాజు. ఆదాము దేవునిపై ఉండవలసిన మన సహజ నమ్మకాన్ని కోల్పోయాడు; కానీ యేసు దానిని తిరిగి స్థాపించాడు — తద్వారా మనం దేవునితో శాంతిని కలిగియుండగలము.
రెండవది — క్రైస్తవులు తమకు క్రీస్తులో లభించిన దానిని స్వీకరించుట. చింత నుండి బయటపడలేరని వారు మోసగించబడ్డారు. ఇది నిజం కాదు; వారు దేవుని శాంతిలో నడవడానికి పిలువబడ్డారు.
మొదటి పాఠం — మన చింతలన్నింటినీ అధిగమించుటకు దేవుడు ఎలా నిరీక్షణ ఇస్తాడో చూపించింది. రెండవ పాఠం — మానవులు ఎందుకు చింతించగలరో వివరించింది. ఇప్పుడు, నిరీక్షణ వంతెనపై మనం వేయబోయే మూడవ అడుగును జాగ్రత్తగా చూద్దాం.
బాధ్యతను గుర్తించుట
రెండు పాదాలనూ నిరీక్షణ వంతెనపై ఉంచినప్పుడు, మనం ఆందోళనను అధిగమించే మార్గంలో ముందుకు సాగుతున్నాం!
మొదటి కొన్ని అడుగులు ఆందోళనను అర్థం చేసుకోవడం, దానిని ఎదిరించడానికి కావలసిన సాధనాలను ఉపయోగించడం నేర్చుకోవడం అనే విషయాలతో సంబంధం కలిగియున్నాయని గుర్తుంచుకోండి.
మన జీవితాల్లో ఉన్న వివిధ సంఘర్షణలు వెలుగులోకి వచ్చినప్పుడు, వాటిని మనం ఎదుర్కోవాలి. పాఠాలు చదవడం మాత్రమే చాలు అని భావించలేము. ప్రతి సమస్య మనల్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోమని పిలుస్తుంది.
ఆరంభంలో ఈ వంతెన మనలను పైకి ఎక్కించే ప్రయాణంలోనికి తీసుకువెళ్తుంది. పర్వత మార్గంలో నడకలాగే, పైకి ఎక్కడం పోరాటంలో ఒక ముఖ్య భాగం. దిగువకు సులభంగా సాగడాన్ని ఆస్వాదించే ముందు, పెద్ద సమస్యలను ముందుగానే ఎదుర్కోవాలి.
మారథాన్ పరిగెత్తేవాడు అవసరమైనదాన్ని మాత్రమే ధరిస్తాడు. తన దుస్తుల విషయంలో జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, తన ఉత్తమ సామర్థ్యంతో పరిగెత్తడానికి అవి అడ్డుకాకుండా చూసుకుంటాడు. అలాగే, మనమూ త్వరగా మరియు సమర్థంగా నిర్ణయాలు తీసుకోవాలి. వాయిదా వేయకూడదు.
చింత ఎల్లప్పుడూ మన హృదయాలలో ఉన్న అభద్రతతో ముడిపడి ఉంటుంది. మనం మనల్ని మనమే చూసుకోగలమని భావించినప్పుడు చింతించము; కానీ మన పరిస్థితి మన స్వంత సామర్థ్యాలకు మించినదని అనిపించినప్పుడు చింతిస్తాము.
మన వ్యక్తిగత నిర్ణయాలు మన చింతలతో ఎలా అనుసంధానమై ఉన్నాయో గుర్తించడంలో మనం నిజాయితీగా ఉండాలి. మన చింతలు మన పరిస్థితుల వల్ల వస్తాయని తరచుగా అనుకుంటాము; కానీ మన స్వంత ఎంపికల పాత్రను చూడము.
"నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది."
— కీర్తన 94:19'నా' అనే మాట ఒక ఒప్పుకోలును సూచిస్తుంది; ఆందోళనకరమైన ఆలోచనలు తనలో ఉన్నాయని అతడు అంగీకరిస్తున్నాడు. ఆలోచనలు వ్యక్తికి చెందినవే. ఇక్కడ ఒక ముఖ్యమైన బాధ్యతా సూత్రం కనిపిస్తుంది: అతడు తన ఆలోచనలను అంగీకరించి వాటికి బాధ్యత తీసుకున్నాడు. అవి తన తలలో తిరుగుతున్నాయని ఒప్పుకోకుండా కూడా వదిలేయవచ్చు; కానీ అతడు అలా చేయలేదు.
మన ఆందోళనకరమైన ఆలోచనలను ఎదుర్కొనుటలో మనం నిజాయితీగా ఉన్నామా? మనం చింతిస్తున్నామని అంగీకరించేంత నిజాయితీ మనకు ఉందా? లేక మన పరిస్థితులపై మనకు పూర్తి నియంత్రణ ఉందని నటిస్తామా?
మన ఎంపిక
చింత లేదా శాంతి — ఇది ఒక జీవిత ఎంపిక.
మనం చేసుకునే పూర్వధారణలు మరియు నిర్ణయాలు, మనం చింతలోనే ఉంటామా లేక శాంతిలోకి ప్రవేశిస్తామా అన్న దానిని నిర్ణయిస్తాయి. ఫలితం మన అంతర్గత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
చింత సాధారణం, ఆమోదయోగ్యమైనది అనే అపోహ
మొదటి సందర్భంలో, ఆ వ్యక్తి చింతను సాధారణమైనదిగా, ఆమోదయోగ్యమైనదిగా చూస్తాడు. ప్రజలు ఆందోళనను “జీవితంలో ఒక భాగం”గా అంగీకరిస్తున్నారనే విషయాన్ని అరుదుగా ఆలోచిస్తారు. దాని ఉనికిని సహించుకొని, చింతతోనే తమ జీవితాలను కొనసాగిస్తారు.
ఉదాహరణకు, తన కంపెనీ ఉద్యోగులను తొలగించబోతుందని ఒక వ్యక్తి విన్నాడు. కాబట్టి ఉద్యోగం కోల్పోకూడదనే భయంతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నాడు. అయితే, ఈ నిర్ణయానికి అతనిని నడిపించింది చింతయే. స్పష్టమైన మనస్సుతో విషయాలను అంచనా వేయలేదు; ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి తాను ఎంచుకున్న విధానాన్ని కూడా గమనించలేకపోతున్నాడు. ఇంట్లో సమస్యలు ఉన్నాయి; అతని భార్య హెచ్చరిక సంకేతాలు పంపుతోంది. కానీ అతడు ఉద్యోగ పరిస్థితిలో అంతగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు. అతని వివాహం బీటలు పడుతోంది; పిల్లలు ఇంట్లో గందరగోళంగా ప్రవర్తిస్తున్నారు.
చింత అసాధారణం, ఆమోదయోగ్యం కాదు అనే నమ్మకం
అదే పరిస్థితిని ఎదుర్కొనే మరో వ్యక్తి చింత ఆమోదయోగ్యమైనది అని నమ్మడు. బదులుగా, దేవుని శాంతిని కోరుకుంటాడు. అతడు అదే పరిస్థితిని ఎలా భిన్నంగా నిర్వహిస్తాడు? సమస్యను పరిష్కరించడానికి తాను తీసుకోవలసిన చర్యల గురించి అతడూ ఆలోచిస్తాడు. కానీ ఈ సందర్భంలో, చింతించకూడదని నిర్ణయించుకుంటాడు.
బహుశా రెండవ వ్యక్తికి తనకు తీవ్రమైన వ్యాధి ఉండవచ్చనే వార్త వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ, దేవునిని నమ్ముటకు ఈ అవకాశం దొరికినందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతాడు. ఆహారంలో మార్పులు మరియు ఇతర సహజ పరిష్కారాల గురించి తెలుసుకుంటాడు. వేర్వేరు వైద్యుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాడు. బయట నుండి చూస్తే, అతడూ మొదటి వ్యక్తిలాగే కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించవచ్చు.
తేడా ఏమిటంటే, ఇతనిని నడిపించేది చింత కాదు; జ్ఞానం. పని నుండి ఇంటికి వచ్చినప్పుడు తన కుటుంబంతో ఆనందిస్తాడు. హృదయం భారంగా లేకపోవుటచేత తన చర్చిలో సేవ చేయగలడు. కృంగిపోయినట్లు భావించకుండా, ఉత్సాహభరితమైన ఆత్మను నిలుపుకుంటాడు. తాను చేయగలిగినదాన్ని చేస్తాడు; మిగతావాటిని చూసుకొనుటకు దేవునిని నమ్ముకుంటాడు.
ఊహలు ఫలితాలను నిర్ణయిస్తాయి
చింత జీవితంలో ఒక సాధారణ భాగమని చాలామంది — అనేకమంది క్రైస్తవులుకూడా — నమ్ముతారు. మనం ఇలాంటి మాటలు చెప్పినప్పుడు, మనల్ని మనం బాధ్యులుగా చూడడం లేదు. మరొక వస్తువు, వ్యక్తి, లేదా జన్యువులపై దోషాన్ని మోపుతున్నాము.
బాధ్యత అంటే మనకు ఎంచుకునే సామర్థ్యం ఉందని అర్థం. మనం దేవుని ప్రతిరూపంలో సృష్టించబడిన మానవులము; అందువల్ల మన ఎంపికలకు మనమే జవాబుదారులము — ఎందుకంటే ఎలా జీవించాలో విషయములో మన సృష్టికర్తకు మనం బాధ్యులము.
వ్యక్తిగత పరిశీలన — మన చింతలను అధిగమించాలంటే మనం ఎదుర్కోవాల్సిన మూడు సమస్యలు
మన చింతలను ఎదుర్కొనే ముందు పరిష్కరించవలసిన మూడు లోతైన సమస్యలు ఉన్నాయి: అవిశ్వాసం, నెపాలు, మరియు పరధ్యానం. ఈ లోతుగా పాతుకుపోయిన సమస్యలను సరిచేయుటకు, తీవ్రమైన మరియు జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోవాలి.
మానవులముగా, మార్పును తప్పించుకోవడంలో మనం చాలా నేర్పరులమైపోతాము. తరచుగా, మనం జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నామనే విషయాన్నే గమనించము. చింతలను అధిగమించాలనుకుంటే, చింత సమయాల్లో మనం ఎలా ఆలోచిస్తున్నామో జాగ్రత్తగా గమనించాలి; ఎందుకంటే అదే యుద్ధరంగం.
1. అవిశ్వాసం
- మీరు నమ్ముతున్న విషయాల విషయంలో మీరు నిజంగా గంభీరంగా ఉన్నారా?
- యేసు మాటలను మీరు గంభీరంగా స్వీకరిస్తున్నారా?
దేవుడు మనకు ఇచ్చిన ఆదేశాలను అనుసరించడానికి సుముఖంగా లేనప్పుడు అవిశ్వాసం కనిపిస్తుంది.
పర్వత ప్రసంగంలో యేసు మూడు సార్లు ఇలా చెప్పాడు: “చింతించకుడి.”
"మీ ప్రాణముకొరకు — ఏమి తినవలెను, ఏమి త్రాగవలెను అనియు, మీ దేహముకొరకు ఏమి ధరించుకొనవలెను అనియు చింతించకుడి."
— మత్తయి 6:25"కావున — ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి."
— మత్తయి 6:31"రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును. ఏ దినపు కీడు ఆ దినమునకు చాలును."
— మత్తయి 6:34యేసు మాటల గంభీరతను అర్థం చేసుకున్నప్పుడు మనం వినయపొందుతాము. ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా చింతించిన అనేక సందర్భాలు మనకు అకస్మాత్తుగా గుర్తుకువస్తాయి. యేసు ఇలా చెప్పాడా లేదా అన్నది ప్రశ్న కాదు; ఆయన మాటలకు మనం ఎలా స్పందిస్తామన్నదే అసలు విషయం.
చింతించవద్దన్న ఆయన ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడమో, లేక దానికి విధేయులవ్వడమో — ఈ రెండింటిలో ఒకటే మన ప్రతిస్పందన అవుతుంది.
మన హృదయాలను వినయపరచి, ఆయనకు అవిధేయులమైనట్లు ఒప్పుకుంటే, పశ్చాత్తాపానికి ద్వారం తెరుచుకుంటుంది. విధేయులవ్వడానికి కావలసిన కృప కోసం ఆయనను వెదుకుతాము.
2. నెపాలు
- మీరు నిజంగా దేవుని శాంతిని కోరుకుంటున్నారా?
- మీ ఆందోళనను సమర్థించుకుంటారా?
దేవుడు మనం చేయమని కోరినదానికి వ్యక్తిగత బాధ్యత తీసుకోకుండా తప్పించుకొనే మార్గమే నెపాలు.
పొగ ప్రమాదకరమయ్యే కారణం, అది మన చూపును మసకబార్చుట. ఒక పొగతెర పరిస్థితిని ఎంతగా కప్పేస్తుందంటే, నిజంగా ఏమి జరుగుతున్నదో మనం చూడలేము. మన నెపాలు పొగతెరలా మారినంత కాలం, బాధ్యతారాహిత్యపు నీడలో మనల్ని మనమే దాచుకుంటాము.
మూడు సాధారణ నెపాలు:
"నా పరిస్థితులు కష్టమైనవి." మన ఆందోళనకు కారణం మన కష్టమైన పరిస్థితులేనని నింద మోపితే, చివరికి నిరాశతో నిండిన హృదయమే మిగులుతుంది. “నాకు ఇంకా డబ్బు ఉంటే...” “నాకు మంచి ఆరోగ్యం ఉంటే...” “నాకు ఆ డిగ్రీ ఉంటే...” ఈ జాబితా ఇక్కడితో ఆగదు! చింతించడానికి విషయాల సంఖ్యకు అంతే లేదు.
"నా నేపథ్యం వేరు." మనలో కొందరు మన వ్యక్తిగత మరియు సామాజిక పరిస్థితులను మన ప్రవర్తనకు నెపంగా ఉపయోగించుకుంటాము. ఇందులో మన ఎత్తు, జాతి, సంస్కృతి, సంప్రదాయాలు, లింగం మొదలైనవి ఉండవచ్చు. మన బాల్య పరిస్థితులు వయోజన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు చూపించాయి. అయితే దురదృష్టవశాత్తు, “దేవా, నన్ను క్షమించి సహాయం చేయుము” అని ప్రార్థించడానికి బదులుగా, “నేను ఏమీ చేయలేను” అనే వైఖరిని సమర్థించుకోవడానికి ఈ నెపాన్ని ఉపయోగిస్తాము.
చింత నిజంగా సహాయకరమైనదేనా?
చింత సహాయకరమైనదని తప్పుగా నమ్మడం అత్యంత మోసకరమైన, బలహీనపరిచే నెపాలలో ఒకటి. మనం ఉపయోగించే పదాలను జాగ్రత్తగా గమనించినప్పుడు, చింత మరియు సరైన శ్రద్ధ (concern) మధ్య మనం గందరగోళం పడుతున్నామని తెలుస్తుంది. నిర్వచనం ప్రకారం చింత అంటే అతిగా కలత చెందడం. నిజమైన చింత ఎన్నడూ సహాయకరమైనది కాదు!
| చింత మన దృష్టిని చెదరగొడుతుంది | సరైన శ్రద్ధ మన దృష్టిని కేంద్రీకరిస్తుంది |
| చింత ప్రణాళిక వేసే శక్తిని బలహీనపరుస్తుంది | సరైన శ్రద్ధ మనకు ప్రణాళిక వేయడానికి సహాయపడుతుంది |
| చింత మన దృష్టిని మసకబారుస్తుంది | సరైన శ్రద్ధ మన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తుంది |
| చింత మనల్ని వదిలేయడానికి నెడుతుంది | సరైన శ్రద్ధ సహనాన్ని ఇస్తుంది |
| చింత సమస్యలను అతిశయపరుస్తుంది | సరైన శ్రద్ధ సమస్యలను స్పష్టంగా గుర్తిస్తుంది |
| చింత మన దృష్టిని స్వార్థంపై కేంద్రీకరిస్తుంది | సరైన శ్రద్ధ ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తుంది |
చింత అనేది ఒక వ్యక్తి తన స్వంత అవసరాలలో మునిగిపోవడం. ఆందోళన మన బాధ్యతలను సరిగా చూసుకోవడానికి మనలను ప్రేరేపించదు; అది కేవలం గందరగోళానికి దారితీస్తుంది.
3. పరధ్యానం
- మీరు చాలా బిజీగా ఉన్నారా?
- భద్రత కోసం మీరు ఇతర వస్తువులపై ఆధారపడుతున్నారా?
ప్రాముఖ్యమైనదానికి, అత్యవసరమైనదానికి సరైన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు పరధ్యానం మొదలవుతుంది.
దేవుని వాక్యపు ప్రభావాన్ని అణచివేసే మూడు విషయాలు ఉన్నాయని యేసు చెప్పాడు: లోకపు చింతలు, ధనమోసం, మరియు ఇతర వస్తువుల పట్ల కోరికలు.
"ముళ్ళపొదలలో విత్తబడినవారు, వాక్యమును విందురు గాని, యీ లోకపు చింతలును, ధనమోసమును, ఇతరమైన అపేక్షలును ప్రవేశించి, ఆ వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును."
— మార్కు 4:18-19అవసరాలు vs కోరికలు
"ఈ శతాబ్దపు ప్రారంభంలో, సగటు అమెరికన్‌కు 72 కోరికలు ఉండేవి, వాటిలో 18 ముఖ్యమైనవిగా భావించేవాడు. శతాబ్దం చివరికి, సగటు అమెరికన్‌కు 496 కోరికలు ఉన్నాయి, వాటిలో 96 ఆనందానికి నిజమైన అవసరాలుగా భావిస్తున్నాడు."
మనకు అవసరమని అనిపించే వాటి సంఖ్య మరియు మన కోరికల సంఖ్య — లోకంలోని చింతల సంఖ్యతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. నేడు మన చింతలు తరచుగా నిజమైన అవసరాలపై కాకుండా కోరికలపై ఉంటాయి; అవి మన దారితప్పిన, లోకీయ హృదయాలను బయటపెడతాయి.
పన్ను డబ్బు కోసం చేప పట్టుట
మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చింతలను ఎదుర్కొనకపోతే, మన విశ్వాసం పరీక్షించబడని స్థితిలోనే ఉంటుంది. చిన్న చింతలను దేవునిపై నమ్మకంతో నిర్వహించడం నేర్చుకున్న తరువాతనే, పెద్ద చింతలను ఎదుర్కొనే విశ్వాసం బలపడుతుంది. తన అవసరాలు మరియు కోరికల విషయంలో యేసు దేవునిని ఎలా నమ్మాడో ఆయన మనకు చూపించాడు. మనం ఆయన నుండి నేర్చుకోవాలి.
- యేసు పన్ను చెల్లించవలసిన అవసరం ఉంది.
- యేసు నియమిత జీతాన్ని ఆశించలేదు (ఆయనకు సాధారణ ఆదాయం లేదు).
- పన్ను కోసం యేసుకు ఎలాంటి పొదుపులు లేవు.
- పన్ను వసూలుదారుడు యేసు యొక్క శిష్యుడైన పేతురును యేసు మరియు తన స్వంత వ్యక్తిగత పన్నుల కోసం అడిగాడు.
- దేవుడు చేయమని కోరిన దానిని యేసు బిజీగా చేస్తున్నాడు.
- తన తండ్రి ఈ అవసరాన్ని తీర్చుతాడన్న విశ్వాసం యేసుకు ఉంది.
- మునుపటి జాలరైన పేతురును, చేప నోటి నుండి పన్ను డబ్బు తీసుకురావడానికి యేసు పంపాడు.
- చేప పట్టబడింది; అవసరమైన డబ్బు దాని నోటిలో దొరికింది.
- పన్ను చెల్లించబడింది.
మన బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మన దగ్గర డబ్బు లేకపోయినా చింతించాల్సిన అవసరం లేదని మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం.
యేసు దేవునిని నమ్మాడు — ఆయన సార్వభౌమ ఏర్పాటులో, సముద్రంలోని ఒక చేప ఆయన పన్నులకు సరిపోయే నాణెాన్ని మింగి ఉండగలదని. సరైన క్షణంలో పేతురు ఆ ఒక్క చేపను పట్టుకుంటాడని కూడా ఆయన నమ్మాడు. స్పష్టంగా, ఇది ఒక అద్భుతం. ఇది తన పిల్లల పట్ల దేవుని ప్రేమను రుజువు చేస్తుంది. క్రెడిట్ కార్డులు మరియు ATM యంత్రాలతో నిండిన ఈ ఆధునిక లోకంలో కూడా దేవుడు అవసరాలను తీర్చగలడు.
ఆందోళనను అధిగమించుటకు సూత్రాలు
- మన చింతలకు మనమే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి — పరిస్థితులపై దోషం మోపకూడదు.
- మూడు అడ్డంకులు ఎదుర్కోవాలి: అవిశ్వాసం, నెపాలు, పరధ్యానం.
- చింత మరియు శ్రద్ధ ఒకటి కాదు — చింత ఎన్నడూ సహాయకరమైనది కాదు.
- నేడు మన చింతలు తరచుగా నిజమైన అవసరాలపై కాకుండా కోరికలపై ఉంటాయి.
- చేప నోటి నుండి పన్ను డబ్బు వచ్చిన సంఘటన — యేసు తండ్రిపై తన సంపూర్ణ నమ్మకాన్ని చూపించింది.
✦ తాకబడిన మన జీవితాలు — అన్వయము
- మీ చింతలకు మీరు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నారా?
- అవిశ్వాసం, నెపాలు, పరధ్యానం — వీటిలో మీలో ఎక్కువగా కనిపించేది ఏది?
- మీరు చింతించే అన్ని విషయాలను రాయండి — ఈ అభ్యాసం చేయండి. వాటిని గుర్తించి, పశ్చాత్తాపపడి, క్షమాపణ కోరండి.
- ఈ రోజే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి?